ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ: కారణాలు, చికిత్స

ectopic-pregnancy-telugu

ప్రతి స్త్రీ తల్లిగా మారాలని ఆశపడుతుంది. గర్భం ధరించినట్టు తెలియగానే ఆనందపడుతుంది. కానీ కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తుంది. గర్భం ధరించాక కొందరిలో ఇలా తక్కువ పరిమాణంలో రక్తస్రావం జరగడం సాధారణమే, కానీ కొన్ని సార్లు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి పరిస్థితులకు కారణం కావచ్చు.

అసలు ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి ఈ మామ్ జంక్షన్  పోస్ట్ లో తెలుసుకుందాం.

ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి?

ఫలదీకరణ జరిగిన తరువాత పిండం గర్భసంచిలో కాకుండా, ఫాలోపియన్ ట్యూబ్లో, లేదా వేరే చోట అభివృద్ధి చెందితే దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ గర్భం ఎక్కువ రోజులు నిలబడదు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులు గర్భాన్ని తొలగిస్తారు.

ఎక్టోపిక్ గర్భాన్ని గుర్తించకపోతే అది ప్రమాదకరంగా మారచ్చు. ఫాలోపియన్ ట్యూబ్ తో పాటూ చుట్టుపక్కల శరీరభాగాల వ్యవస్థలను దెబ్బతీయవచ్చు. అంతర్గత రక్తస్రావం జరగడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరుగుతాయి. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభించకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ఎక్టోపిక్ గర్భం లక్షణాలు

ఈ లక్షణాలు ఒక్కోస్త్రీలో  ఒక్కో లా ఉంటాయి. కొంతమందిలో అయితే ఎలాంటి లక్షణాలు బయటపడవు కూడా.

గర్భం ధరించిన మొదట్లో కొంతమంది మహిళలు, ఆరోగ్యకరమైన గర్భధారణ మాదిరిగానే లక్షణాలను కలిగిఉంటారు.

 • పీరియడ్స్ రాకపోవడం
 • రొమ్ముల్లో నొప్పిగా అనిపించడం
 • పొట్టలో  చికాకు
 • నడుము కింద నొప్పి రావడం
 • యోని దగ్గర తక్కువపరిమాణంలో రక్తస్రావం కనిపించడం
 • పొత్తి కడుపు నొప్పిగా ఉండటం
 • కటిభాగంలో ఒకవైపు సన్నని నొప్పి రావడం

ప్రారంభ దశలో అది సాధారణ గర్భమా లేక ఎక్టోపిక్ గర్భమా అనేది తెలుసుకోవడం కష్టం. ఎక్టోపిక్ గర్భం అయితే కొన్ని తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

 • పొట్ట, భుజాలు, మెడ, కటి భాగాలలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం
 • రక్తస్రావం తక్కువ పరిమాణంలో మొదలై పెరగడం
 • మైకంగా, నీరసంగా, కళ్లుతిరుగుతున్నట్టు అనిపించడం
 • మలవిసర్జన సమయంలో విపరీతమైన ఒత్తిడిగా అనిపించడం

ఈ లక్షణాలు ఉన్నట్టయితే  ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించాలి.

ఎక్టోపిక్ గర్భం  రావడానికి కారణాలు

ఎక్టోపిక్ గర్భం ఏర్పడటానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియదు. కింద వివరించిన కారణాల్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది.

 • ఇంతకు ముందు జరిగిన సర్జరీలు,ఇన్ఫెక్షన్ వల్ల ఫాలోపియన్ ట్యూబులలో వాపు , ఇన్ఫెక్షన్,  ఏర్పడటం వల్ల కావచ్చు. ఆ దారిలో అండాశయంలోకి  పిండం ప్రయాణించే  వీలు లేక పోవటం కూడా కావచ్చు.
 • హార్మోనల్ కారణాలు
 • పుట్టుకతో వచ్చిన లోపాలు
 • జన్యుపరంగా వచ్చిన లోపాలు
 • ఫాలోపియన్ గొట్టాలు వంటి సంతానోత్పత్తికి తోడ్పడే అవయవాల ఆకారం, పనితీరులో లోపాలు.
 • తల్లి వయసు 35 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉంటే
 • గతంలో ఎక్టోపిక్ గర్భం ఏర్పడి ఉంటే
 • ఫాలోపియన్ ట్యూబు, పొట్ట, కటి భాగాలలో శస్త్రచికిత్సలు జరగడం లేదా ఎక్కువసార్లు గర్భస్రావాలు జరగడం
 • pelvic inflammatory disease (PID) సమస్యను గతంలో కలిగి ఉండడం
 • ఎండోమెట్రియోసిస్ సమస్య గతంలో కలిగి ఉండడం
 • ఐయూడీ వంటి గర్భనిరోధక పరికరాలు ఉండగానే గర్భం రావడం
 • సంతానోత్పత్తి మందులు లేదా చికిత్సల అనంతరం గర్భం ధరించడం

పై వాటిలో ఏవైనా మీకు జరిగి ఉంటే, ఎక్టోపిక్ గర్భధారణా అవకాశాలను తగ్గించుకోవడానికి వైద్యుడితో చర్చించండి.

 ఎక్టోపిక్ గర్భాన్ని ఎలా గుర్తిస్తారు?

ఎక్టోపిక్ గర్భాన్ని గుర్తించటం కొంచెం కష్టమే. మీకు ఇలాంటి గర్భం ఉందని వైద్యులు నిర్ధారించుకునేందుకు కింది పరీక్షలు చేస్తారు.

 • ప్రెగ్నెన్సీ హార్మోన్ అయిన హెచ్ సీజీ  కోసం రక్త పరీక్ష చేస్తారు.
 • గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్ పరిస్థితిని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు.
 • కటి భాగంలో పరీక్షలు నిర్వహిస్తారు.

పైన పేర్కొన్న పరీక్షల రిపోర్ట్  ఆధారంగా ఎక్టోపిక్ గర్భం నిర్ధారించబడితే, మీ డాక్టర్ చికిత్స విధానాన్ని తెలియజేస్తారు.

ఎక్టోపిక్ గర్భం కలిగితే చికిత్స ఏమిటి?

ఎక్టోపిక్ గర్భంతో తల్లి ప్రాణానికే ప్రమాదం. ఫలదీకరణ జరిగినా అండం గర్భాశయం బయట బతకలేదు. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దానిని వెంటనే తొలగించాలి. ఎక్టోపిక్ గర్భం చికిత్స అనేది గర్భధారణ వయసు, హార్మోన్ల స్థాయిలు, పిండం ఎక్కడ ఏర్పడింది అనే అంశాలపై  ఆధార పడి ఉంటుంది.

 • మందులతో చికిత్స

వెంటనే సమస్యలు కలిగే అవకాశం లేదనిపిస్తే మీ వైద్యుడు మందులతో చికిత్స ప్రారంభిస్తారు. పిండం పెరుగుదలను, కణ విభజనను నిరోధించడానికి మీకు మందులు లేక ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. రక్తస్రావం, నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలతో గర్భస్రావానికి దారితీస్తుంది.

 • సర్జరీ

లాపరోస్కోపీ విధానంలో  పిండం తొలగించబడుతుంది. బొడ్డు దగ్గర ఒక చిన్న కోత పెట్టి, దానిలోనుంచి ఒక చిన్న కెమెరా లోపలికి  పంపబడుతుంది. అప్పుడు సర్జన్ శస్త్రచికిత్సా సాధనాలను ఉపయోగించి గర్భం తొలగిస్తారు. కొన్నిసార్లు, శస్త్రచికిత్స వల్ల ఫెలోపియన్ గొట్టాలు గీతలు పడొచ్చు. అవి తరువాత మరమ్మతులు చేయబడతాయి లేదా కొంతమేర తొలగించబడతాయి.

 • అత్యవసర ఆపరేషన్

రక్తస్రావం అధికంగా ఉంటే వెంటనే  లాపరోటోమి సాయంతో శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఈ శస్త్రచికిత్సలో పొట్టపై కోత పెట్టి, పిండాన్ని తొలగిస్తారు. ఈ క్రమంలో ట్యూబ్ ఛిద్రమైతే దాన్ని కూడా తొలగించవచ్చు.

శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు

శస్త్రచికిత్స అనంతరం రక్తస్రావం, నొప్పి, అలసట, ఇన్ఫెక్షన్ వంటివి కలిగే అవకాశం ఉంది. మీ వైద్యులు శస్త్రచికిత్సకు ముందే వీటి గురించి మీతో చర్చిస్తారు.

శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ ఎలా?

శస్త్రచికిత్స అనంతరం ఇంట్లో కొన్ని నెలలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  పొట్టపై కోత పడిన ప్రాంతాన్ని డాక్టర్ల సూచన మేరకు పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇన్ఫెక్షన్ చేరిందేమోనని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇన్ఫెక్షన్ కలిగితే కింద చెప్పిన  లక్షణాలు కనిపిస్తాయి:

 • అధిక రక్తస్రావం
 • కోత ప్రదేశంలో ఒక దుర్వాసన
 • తాకితే నొప్పి రావడం
 • వాపు, ఎరుపుదనం

శస్త్రచికిత్స తర్వాత స్వల్ప పరిమాణంలో రక్తస్రావం అవుతుంది. దాదాపు ఆరు వారాల పాటు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • బరువులు ఎత్తకూడదు
 • మలబద్దకం కలగకుండా ద్రవాలు తాగాలి
 • వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి
 • కటి ప్రాంతానికి విశ్రాంతిని ఇవ్వడానికి సెక్సుకు దూరంగా ఉండాలి

ఎక్టోపిక్ గర్భం రాకుండా నివారించగలమా?

ఎక్టోపిక్ గర్భం రాకుండా పూర్తిగా నిరోధించలేము.  కానీ అది వచ్చే అవకాశాలను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

 • సెక్స్ చేసేటప్పుడు లైంగిక వ్యాధులను, కటి ప్రాంతంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి కండోమ్లను వాడాలి.
 • ఎక్కువమందితో సెక్స్ చేయడాన్ని మానివేయాలి.
 • గర్భం కోసం ప్రయత్నించే ముందు ధూమపానానికి దూరంగా ఉండాలి.

ఎక్టోపిక్ సర్జరీ అయ్యాక మళ్ళీ గర్భం రావడానికి ఆస్కారం ఉందా?

చాలా మంది స్త్రీ లలో ఎక్టోపిక్ సర్జరీ అయ్యాక  ఆరోగ్యకరమైన గర్భం వచ్చే అవకాశం ఉంది. ఫాలోపియన్ ట్యూబులలో పాడైపోయినవి తీసివేసినా, ఆరోగ్యంగా ఉన్న ట్యూబ్ లు బాగానే పనిచేస్తాయి. ఎక్టోపిక్ గర్భం గురించి తెలిసిన వెంటనే చికిత్స చేయించుకుంటే, ఫాలోపియన్ ట్యూబుల నష్టం తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ ఆరోగ్యకరమైన గర్భం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ గురించి మీ అనుభవాలను మాతో పంచుకోండి.

ప్రస్తావనలు

Was this information helpful?
Comments are moderated by MomJunction editorial team to remove any personal, abusive, promotional, provocative or irrelevant observations. We may also remove the hyperlinks within comments.

Back to Top